Wednesday, August 5, 2015

CM review on KG to PG education in the state.


రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలన్నీంటిని ఒకే గొడుగు కిందికి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి సగటున పది రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసి 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. 12వ తరగతి తరువాత కూడా ఈ విద్యార్థులు ఏ కోర్సులు ఎంచుకుంటున్నారు? వారికి ఎలాంటి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలనే దానిపై ఓ సమగ్ర విధానం రూపొందించాలని సిఎం చెప్పారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, వికలాంగులు తదితర కేటగిరిల్లో రెసిడెన్షియల్‌ స్కూళ్లు నడుస్తున్నాయని, ఒక్కో పాఠశాలలో ఒక్కో విధానం, ఒక్కో మెనూ, ఒక్కో మెస్‌ చార్జి విధానం, ఒక్కో బడ్జెట్‌ ఉన్నాయన్నారు. అలా కాకుండా అందరికి ఒకే రకమయిన విద్య, వసతి, సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులకు గ్రాముల చొప్పున కాకుండా ఎవరు ఎంత తింటే అంత అన్నం పెట్టాలన్నారు. బఫె పద్దతిలోనే అన్నం పెట్టాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో కేజి టు పీజి విద్యా విధానంపై ముఖ్యమంత్రి సచివాలయంలో బుధవారం విద్యా శాఖ, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టిఎస్‌ పిఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు రేమాండ్‌ పీటర్‌, రాజీవ్‌ రంజన్‌ ఆచార్య, ప్రవీణ్‌ కుమార్‌, చిరంజీవులు, రాజా, ఉమర్‌ జలీల్‌, మహెష్‌ దత్‌ ఎక్కా, అరుణ, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం పూట సెషన్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులందరికి కుల మతాలతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. నాలుగవ తరగతి వరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలు ఉండాలని, దానికి అనుగుణంగా గ్రామ స్థాయిలోనే విద్యా బోధన జరగాలన్నారు. ఆ తరువాత మాత్రం పేదలకు ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యమైన విద్య అందించాలని చెప్పారు. ప్రస్తుతం సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నంతలో మెరుగ్గా నడుస్తున్నాయని, స్వల్ప మార్పులు అవసరమయితే చేసుకుని అదే నమునాలో రాష్ట్ర వ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం వివిధ శాఖల కింద 668 స్కూళ్లు నడుస్తున్నాయని, మిగతా 522 స్కూళ్లను ప్రారంభించాలని చెప్పారు. ఇంటర్‌మీడియట్‌ (12వ తరగతి) తరువాత విద్యార్థులు చదివే అంశాలను బట్టీ వారి వసతి సంగతి చూడాలన్నారు.
తెలంగాణలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికి వారికి కేటాయించిన హాస్టళ్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 పెగా హాస్టళ్లు ఉంటే మైనారిటీల కోసం కేవలం 21 హాస్టళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రతి జిల్లాలో మైనారిటీల కోసం ఒక రెసిడెన్షియల్‌ పాఠశాల, ఒక హాస్టల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతిని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. చాలా మంది మైనారిటీ అమ్మాయిలు కొంత వరకే చదివి ఆపేస్తున్నారని, ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పిస్తే వారు కూడా ఉన్నత చదువులు చదువుతారని సిఎం అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో దళిత అమ్మాయిల కోసం ప్రత్యేక హాస్టల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.
సాంకేతిక విద్యా విధానంలో కూడా మార్పులు రావలసిన అవసరం ఉందని సిఎం అన్నారు. చదువంటే కేవలం మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ మాత్రమే అని భావన పోవాలని చెప్పారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్లు హోం గార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామి కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గు చేటైన విషయమని చెప్పారు. ఈ పరిస్థితి నివారించడానికి సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావలసిన అవసరం ఉందన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించే వారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలన్నారు. ఏ వృత్తిలో ఎంతమంది అవసరం? అనే విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కోర్సులు తీసుకురావాలన్నారు. ఐటిఐ లాంటి సంస్థలను కూడా విద్యా శాఖే నిర్వహించాలని చెప్పారు.
విద్యా శాఖపై మధ్యాహ్నం కూడా సమీక్ష కొనసాగింది. ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సులు ఉద్యోగ అవకాశాలను పెంచే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయో గుర్తించి వాటికి అనుగుణమైన కోర్సులు డిగ్రీలో ప్రవేశపెట్టాలన్నారు. విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కలిగించాలన్నారు. పోటీ పరీక్షలంటే కేవలం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలే అనే భావన పట్టభద్రుల్లో నెలకొని ఉందని, కాని దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు గుర్తించేలా చేయాలన్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత చాలామంది యువకులు ఖాళీగానే ఉంటున్నారని, అలా ఉండకుండా డిగ్రీ చదువుతుండగానే తరువాత ఏం చేయాలనే విషయంపై వారికి స్పష్టత ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల నిర్వహణను మరింత సమర్దవంతంగా నిర్వహించాలని, అవసరమైన లెక్చరర్ల నియామకాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూ భాషలను సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండాలని, ఇంగ్లీషు మీడియంలో చదివినప్పటికీ తమ మాతృ భాష అయిన తెలుగు లేదా ఉర్దూ భాషపై పట్టు కోల్పోకుండా ఉంటుందని అన్నారు.
అనాథ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెటాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికి తల్లీదండ్రి రాష్ట్ర ప్రభుత్వమే అని ఇప్పటికే ప్రకటించుకున్నందున అందుకు తగ్గట్లు వారి పోషణ, రక్షణ, చదువు, స్వయం సమృద్ది విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అనాథలందరిని స్టేట్‌ చిల్డ్రన్‌గా గుర్తించాలని చెప్పారు. 10వ తరగతి పూర్తయిన స్టేట్‌ చిల్డ్రన్‌ను ఇంటర్మీడియట్‌లో రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు.

No comments:

Post a Comment