Tuesday, August 18, 2015

పోలీస్ నియామకాల వయోపరిమితి పెంపు..?



పోలీస్ నియామకాల వయోపరిమితి పెంపు?
- కానిస్టేబుల్‌కు ఐదేండ్లు, ఎస్‌ఐకి మూడేండ్లు
- ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు
-నియామక ప్రక్రియలోనూ మార్పులు
- పరుగుపందెం స్థానంలో దేహదారుఢ్య పరీక్ష
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: నిరుద్యోగులకు మరో శుభవార్త. పోలీసు ఉద్యోగాల నియామకాల్లో సైతం వయోపరిమితి సడలించే అవకాశముంది. కానిస్టేబుల్ పోస్టులకు ఐదేండ్లు, ఎస్‌ఐ పోస్టులకు మూడేండ్లు సడలించే అవకాశముందని సమాచారం. ఈ మేరకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే నియామకాల వయోపరిమితిని పదేండ్ల్లు సడలిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనిఫాం ఉద్యోగాలకు కూడా వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను సమర్పించారు. ఇంతవరకూ కానిస్టేబుల్ ఉద్యోగానికి18 నుంచి 21 ఏండ్ల వయోపరిమితి ఉంది. దానిని 25 ఏండ్లకు సడలించాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. అలాగే 25 ఏండ్ల వయోపరిమితి ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) ఉద్యోగానికి 28ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని సూచించింది. తమ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని పోలీసుఉన్నతాధికారులు నమస్తే తెలంగాణకు తెలిపారు.
మారనున్న ప్రక్రియ.. సిలబస్..: మరోవైపు నియామకాల ప్రక్రియను కూడా పూర్తిగా మార్చివేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. తాజా మార్పుల ప్రకారం పోలీస్ శాఖలో చేరే అభ్యర్థుల తెలివి తేటలు, చురుకుతనం, మేథోసంపత్తి ఆధారంగానే నియామకాలు జరపాలని నిర్ణయించారు. గతంలో ఉన్న 5కిలోమీటర్ల పరుగుపందెం, బరువులు ఎత్తడం వంటి పరీక్షలను తొలగించి కేవలం సాధారణ దేహదారుఢ్య పరీక్షలకే పరిమితం చేయనున్నారు. గ్రూప్స్ పద్ధతిలో ముందు రాతపరీక్ష, ఆ తర్వాత సాధారణ దేహదారుఢ్య పరీక్ష, అనంతరం మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నియామక పద్ధతుల్లో మార్పుచేర్పులపై ఐదు రోజుల్లో జీవోలు వచ్చే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇకపోతే ఎస్‌ఐ పరీక్షకు సిలబస్‌పై కూడా అధికారులు కొంత వరకు స్పష్టత ఇచ్చారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్సైజ్ ఎస్‌ఐకి ఇచ్చిన సిలబస్‌నే ఎస్‌ఐ పరీక్షకు వర్తింపజేయాలని ప్రతిపాదించామని, అలాగే తెలంగాణ చరిత్ర త పరీక్షకు ఒక పేపర్‌గా ఉంటుందని వారు తెలిపారు. కానిస్టేబుల్ రాత పరీక్షకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ పరీక్ష సిలబస్ ఉంటుందని, మరో పేపర్‌గా తెలంగాణ చరిత్ర పేపర్ ఉంటుందని వివరించారు.

No comments:

Post a Comment