Friday, August 21, 2015

దశరథ్ మాంఝీ కొండను సైతం పిండి చేసి 75 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒక కిలోమీటరుకు తగ్గించాడు



మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య జ్ఞాపకంగా దాదాపు 300 ఏళ్ల కిందట 
తాజ్‌మహల్ కట్టించాడని చరిత్రలో చదువుకున్నాం. మరి ప్రస్తుత 
కాలానికొస్తే తన భార్యకొచ్చిన కష్టం మరొకరికి రానివ్వకుడదని 30 ఏళ్ల 
కిందట బీహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ కొండను సైతం పిండి చేసి దాని 
మధ్యలో 
రోడ్డును వేసి 75 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఒక కిలోమీటరుకు 
తగ్గించాడు. ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే హీరోహీరోయిన్లుగా 
‘మాంఝీ ద మౌంటెయిన్ మ్యాన్’ పేరుతో తెరకెక్కిన దశరథ్ మాంఝీ 
బయోపిక్ ఆగస్ట్ 21న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 
తమ భార్యల కోసం నాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్, నేటి సామాన్యుడు 
దశరథ్ మాంఝీ ఎంత కష్టపడ్డారో పోల్చిచెబుతూ సోషల్ మీడియాలో 
పోస్టింగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అవేంటంటే...
ముంతాజ్ బేగం జ్ఞాపకంగా తాజ్‌మహల్ కట్టించడానికి షాజహాన్ తానుగా 
ఒళ్లొంచి పనిచేసిందేమీ లేదు. ఈ కట్టడం కోసం 22వేల మంది కూలీలతో 
పాటు, 1000 ఏనుగులను కూడా ఉపయోగించాడు. దేశవిదేశాల నుంచి తన 
ప్రేమ మందిరం కోసం పాలరాయి, విలువైన రత్నాలు తెప్పించాడు. ఇంతా 
చేస్తే టూరిస్ట్ ఎట్రాక్షన్‌గా మిగలడం తప్ప తాజ్ వల్ల ప్రజలకు కలిగిన 
ప్రయోజనమేదీ లేదన్నది నెటిజన్ల మాట. పైగా 21 ఏళ్ల పాటు సాగిన తాజ్ 
నిర్మాణ కాలంలో ఎంతో మంది కార్మికులు కట్టడం పైనుంచి పడి 
చనిపోయారని కూడా అంటున్నారు.
ఇక దశరథ్ మాంఝీ విషయానికొస్తే.. తన భార్య ఫల్గుణీ దేవి అనారోగ్యానికి 
గురైనప్పడు ఆమెను వైద్యం కోసం పట్నానికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు 
మార్గం లేక ఆమెను పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరెవరికి ఈ కష్టం 
కలగకూడదనే మానవతా దృక్పథంతో కొండను తవ్వి రోడ్డు వేశాడు. 22 ఏళ్ల 
పాటు రేయింబవళ్లు శ్రమించి ఈ పని చేసింది దశరథ్ మాంఝీ ఒక్కడే. 
అతనికున్న తోడల్లా ఉలి, సుత్తి. మరి హీరో ఎవరూ?, జీరో ఎవరని నెటిజన్లు 
ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment