Saturday, September 19, 2015

రాముడు ఎప్పుడు పుట్టాడో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు..




రాముడు ఎప్పుడు పుట్టాడో ఘడియలు, విఘడియలతో సహా తమకు తెలుసంటున్నది ఒక పరిశోధన సంస్థ. రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణాలు కావని, వాస్తవంగా జరిగినవేనని బల్లగుద్దిమరీ చెప్తున్నది! అంతేకాదు.. అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెప్పేస్తున్నారు. వీరి లెక్కల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించాడు.



అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు క్రీస్తుపూర్వం 5076వ సంవత్సరం సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ లెక్కవేసింది. ఇక మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది. రుగ్వేదం నుంచి.. రోబోటిక్స్‌దాకా అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ ఢిల్లీలోని లలిత కళా అకాడెమీలో ఏర్పాటు చేసింది. గురువారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సంస్థను కోరామని చెప్పారు.


అమెరికా నుంచి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఒక సాఫ్ట్‌వేర్, పరిశోధన సహాయంతో తాము గ్రహాల గమనాలను అంచనా వేసి ఈ తేదీలను రూపొందించామని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. మహాభారతం, రామాయణం ఉనికిపై ప్రశ్నలకు ఈ ఎగ్జిబిషన్ శాస్త్రీయ సమాధానాలు ఇస్తుందని కేంద్ర మంత్రి మహేశ్‌శర్మ చెప్పారు.



ఒక ముస్లిం అయి ఉండి కూడా అబ్దుల్ కలాం జాతీయవాదిగా ఉన్నారంటూ గతంలో మహేశ్‌శర్మ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాకేశ్ తివారీ, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ దినేశ్ సింగ్‌లను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాకపోవడం విశేషం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కూడా ఆహ్వానించామని, అయితే ఆమె స్పందించలేదని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. రాముడు జన్మించినప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉందనే విషయం పురాణాల్లో ఉందని, దాని ఆధారంగా తాము సాఫ్ట్‌వేర్‌లో మ్యాపింగ్ చేసినప్పుడు సంవత్సరం, నెల, తేదీ, సమయం తెలిసిపోయాయని తెలిపారు. ఇదే పద్ధతిలో పాండవుల వనవాసం, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టిన రోజులు కూడా కనిపెట్టామని చెప్పారు.

No comments:

Post a Comment