హెల్మెట్ వాడకంపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. త్వరలో తప్పని సరి చేయనున్న హెల్మెట్ వాడకం వల్ల ఉన్న ప్రయోజనాలపై రవాణాశాఖ కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా టూ వీలర్‌పై వచ్చే ప్రతి రవాణాశాఖ ఉద్యోగి కచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని లేనట్టయితే కార్యాలయ ప్రాంగణంలోకి వారి వాహనాన్ని అంగీకరించమని హెచ్చరించారు. రెండో రోజు కూడా గ్రేటర్ పరిధిలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాలలో హెల్మెట్ లేకుండా రవాణాశాఖ కార్యాలయంలోకి అనుమతించలేదు. దీనితో కార్యాలయాల బయట వాహనాల పార్కింగ్ సంఖ్య బాగా పెరిగింది. ఇదిలా ఉండగా హెల్మెట్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ కార్యాలయ పరిధిలో జేటీసీ రఘునాథ్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో ఉప్పల్ రవాణాశాఖ కార్యాలయంలో ఉదయం 9గంటలకే హెల్మెట్‌తో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించిన తర్వాతనే హెల్మెట్‌ను రెగ్యులరైజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

No comments:
Post a Comment