Thursday, September 10, 2015

ఒక్కో సారి చిన్న పొరపాటు జీవితాన్ని మార్చేస్తుంది.


ఒక్కో సారి చిన్న పొరపాటు జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటివి గుర్తింపు కార్డుల్లో జరిగితే .. మరింత కష్టం, నష్టం తప్పదు. ధ్రువీకరణ పత్రాల్లో చిన్న అక్షరం పొరపాటున మారిపోయినా జీవితంలో ఎన్నో మంచి అవకాశా ల్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ధ్రువీకరణ పత్రాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి తప్పులు దొర్లుతూనే ఉంటాయి. అత్యవసర సమయంలో భారీ నష్టం చేకూర్చుతాయి. అలాంటి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? దరఖాస్తు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి...? అనే అంశాలపై కొన్ని సూచనలు మీకోసం...
 
జనన ధ్రువీకరణ పత్రం విద్యార్ది జీవితంలో చాలా ముఖ్యమైంది. పేరు, తేదీ వీటిలో ఏది తప్పుగా పడినా భారీగా ఇబ్బంది పడాల్సిందే... పిల్లలను బడిలో చేర్పించిన నాటినుంచి పదోతరగతి మార్కుల జాబితా వరకు ఆ వివరాలనే రాస్తారు. పాస్‌పోర్టు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీ తప్పుగా ఉంటే పరిగణనలోకి తీసుకోరు. ఎన్నో అవకాశాలు కోల్పో వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే తప్పులుంటే వెంటనే మార్పులు చేయించుకోవాలి. ఇందుకోసం దరఖాస్తుదారుడు ఏదో ఒక గుర్తింపు (రేషన్‌, ఆధార్‌, ఓటర్‌ కార్డు)ను కలిగివుండాలి. మార్చడానికి కారణాలను తెలుపుతూ బాండ్‌ పేపర్‌పై నోటరీ చేయించాలి. మునిసిపల్‌ కార్యాలయాల్లో మార్పునకు సంబంధించిన దరఖాస్తును నింపాలి. ఆ వివరాలు సక్రమమని తెలుపుతూ ఇద్దరు గెజిటెడ్‌ అధికారులతో సంతకాలు చేయించి దరఖాస్తు సమర్పించాలి. ఆ వివరాలను క్షేత్రస్థాయిలో వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నిర్ధారించిన తర్వాత రూ.50 చలానా చెల్లించాలి. తర్వాత నెల రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.
 
పాస్‌పోర్టు...
ముందుగా తప్పులకు సంబంధించిన వివరాలను పాస్‌పోర్టు కార్యాలయంలో తెలియజేయాలి. ఆ మేరకు దరఖాస్తు రాసి అందుకు రుజువుగా ఏదైనా అసలు ధ్రువీకరణ పత్రం జిరాక్స్‌, పాస్‌పోర్టు, రూ.1500 చలానాను జతచేసి ఇవ్వాలి. 15 రోజుల్లో సరిచేసిన కొత్త పాస్‌ పోర్టు వస్తుంది. 
 
పాన్‌కార్డు..
తప్పు దొర్లిన దానిపై సవరణ కోరుతూ దరఖాస్తుతో పాటు రూ.50 రుసుం చెల్లించి తప్పును సరిచేసేందుకు అసలు ధ్రువీకరణ పత్రం నకలును జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఇన్‌కంట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి సరిచేసిన పాన్‌కార్డు పది రోజుల్లో పోస్టు ద్వారా పంపిస్తారు. 
 
రేషన్‌ కార్డు..
రేషన్‌ కార్డులో పొరబాట్లు ఉంటే సమీపంలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోగానీ తహసీల్దార్‌ కార్యాలయంలోగానీ దరఖాస్తు చేయాలి. కార్డుదారుడి నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఓటరు కార్డు నకలును జతచేయాలి. దీని ఆధారంగా తనిఖీ ఇన్స్‌పెక్టర్‌ ఇంటికి వచ్చి విచారణ జరిపి సిఫారసు చేస్తారు. అప్పుడు ఆన్‌లైన్‌ కేంద్రంలో తప్పులు, చిరునామాలను సరిదిద్ది కార్డును అందజేస్తారు.
 
 ఆధార్‌ కార్డు...
ఆధార్‌ కార్డులో తప్పులను సరిచేసేందుకు రేషన్‌ కార్డు, ఓటరు కార్డు, పిల్లల సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లను సంబంధిత కేంద్రం సిబ్బందికి అందజేయాలి. ఆ మేరకు డిక్లరేషన్‌ పారాలను నింపి ఇస్తే, పిన్‌నెంబర్‌ ఆధారంగా కార్డులను
క్రమబద్దీకరిస్తారు. ప్రస్తుతం పేర్ల మార్పులు చేర్పులకు ఆయా కేంద్రాల్లో వివరాలు 
తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే సవరణకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్‌ కార్డుల్లో తప్పుల మార్పునకు ఇదే పద్ధతిని పాటిస్తున్నట్టు వివరిస్తున్నారు.

 
డ్రైవింగ్‌ లైసెన్స్‌...
ఎల్‌ఎల్‌ఆర్‌ పొందేటప్పుడు సమర్పించిన దరఖాస్తులో రవాణా శాఖ సిబ్బంది వల్ల తప్పులు దొర్లితే అక్కడికక్కడే మార్పుచేస్తారు. శాశ్వత లైసెన్స్‌ను తీసుకునేటప్పుడు, మైగ్రేషన్‌ సమయంలో తప్పు ఉందని తెలియజేస్తే వాటిని సరిచేస్తారు. పొరబాటున తప్పులను గుర్తించక శాశ్వత లైసెన్స్‌ కార్డును పొందితే ఆయా తప్పుల సవరణకోసం (ఉదాహరణకు పేరు, తండ్రిపేరు, పుట్టిన తేది, చిరునామ) సంబందించి ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలను చూపించాలి. సంబంధిత దరఖాస్తుతో పాటు రూ.475 చలానా చెల్లిస్తే సరిచేస్తారు.
 
 విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు...
పదో తరగతి ధ్రువీకరణ పత్రంలో తప్పులకు సంబంధించి ఏదో ఒక ఆధారంతో తాను చదివిన పాఠశాలలోని ప్రదానోపాధ్యాయుడితో దరఖాస్తు చేయించాలి. కలెక్టర్‌ కార్యాలయంలో రూ.80 చలానా చెల్లించి తగిన ఆధారాలను జతచేసి ఎస్సెస్సీ బోర్డుకు పంపాలి. సుమారు పదిరోజుల్లో తప్పులు దిద్దిన ద్రువపత్రాన్ని పొందవచ్చు. పది తర్వాత ఇంటర్‌కు సంబంధించి సంబంధిత బోర్డులకు పంపాలి. డిగ్రి, పీజీకి సంబంధించి ఏ విశ్వవిద్యాలయంలో చదివితే అక్కడి డైరెక్టర్‌కు సరియైున వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి.
 
 మరణం...
మరణ ధ్రువీకరణ పత్రంలో తప్పులు దొర్లితే కుటుంబీకులకు రావాల్సిన పింఛన్‌, పీఎఫ్‌, బీమా, వివిద పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి అందేసాయం నిలిచిపోయే అవకాశం వుంది. చనిపోయిన వ్యక్తి ఉద్యోగం తదితర వివరాలను కుటుంబసభ్యులు ఇచ్చేటపుడు తప్పులు వస్తుంటాయి. వాటిని సవరించుకోవాలంటే ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పని సరి. మార్పులతో కూడిన దరఖాస్తుకు గుర్తింపు కార్డు, జిరాక్స్‌ను జతచేసి నోటరీ రాయాలి. తర్వాత నగరపాలక, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల అధికారులు వచ్చి పరిశీలిస్తారు. మార్పు చేసిన ధ్రువపత్రాన్ని నెలరోజుల్లో అందిస్తారు. 
for more http://www.andhrajyothy.com/Artical?SID=150508 thank you andrajyothi

No comments:

Post a Comment