ఈ నెల నుంచి బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకు ల్లో ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజుల్లో వ్యాపారులు, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ప్రతి శనివారం అరపూట బ్యాంకులు పని చేసేవి. అప్పటి వరకు ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీల ద్వారా నగదు బదిలీ జరిగేది.
ఆర్‌టీజీఎస్ ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఖాతా ద్వారా నైనా మరో బ్యాంకు ఖాతాకు రోజు రెండు లక్షలకుపైగా డబ్బులను బదిలీ చేసుకోవచ్చు. అలాగే, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా రూ.రెండు లక్షల లోపు బదిలీ చేయడానికి వీలుంటుంది. వీటిని ఉపయోగించే చాలా మంది వ్యాపారులు నగదు బదిలీలు చేసుకుంటున్నారు.
అయితే, ఆర్‌బీఐ తాజాగా నెలలో రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించడంతో ఆయా రోజుల్లో వ్యాపారులు తమ నిధులను బదిలీ చేయడం వీలు కాదు. ఇప్పుడు నెలలో అదనంగా రెండు రోజులు ఇలా నగదు బదిలీ చేసుకోవడం వీలు కాని పరిస్థితి ఏర్పడుతుండడంతో వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాగా, ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బ్యాంకు ఉద్యోగులు స్వాగతిస్తుండగా వ్యాపారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
నేడు బ్యాంకులకు సెలవు.....
ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మొదటి సారి ఈ శనివారం బ్యాంకులు సెలవు పాటించనున్నాయి. ఇక ప్రతి మాసంలో రెండు, నాలుగో శనివారాలు సెలవు పాటించి, మిగిలిన శనివారాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఒక నెలలో ఐదు శనివారాలు వచ్చినా రెండు, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.

No comments:
Post a Comment