Monday, September 14, 2015

ఇప్పుడు కాలం మారింది కార్పొరేట్ పాఠశాలకు స్మార్ట్ క్లాస్‌లు...

 
పలక.. బలపం.. పుస్తకాలు.. పెన్ను.. పెన్సిల్.. బ్లాక్ బోర్డులు.. ఇవి పాతకాలం మాట. ఇప్పుడు కాలం మారింది. అంతా టెక్నాలజీ మయం.. ఇంతకాలం ప్రైవేట్, లకే పరిమికార్పొరేట్ పాఠశాలతమై స్మార్ట్ క్లాస్‌లు.. ఇక నుంచి సర్కారీ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి ఉన్నత వర్గాల పిల్లలు చదివే చదువులు సామాన్యుల పిల్లలకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ స్కూళ్లలో టాబ్లెట్ పీసీ ఆధారిత చదువులు ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగాలు.. అసైన్‌మెంట్లు.. ఇంటిపని.. రాతపని.. అన్నీ టాబ్లెట్‌లోనే.. ఇక నుంచి కేజీల కొద్దీ పుస్తకాలు మోసే బాధ పిల్లలకు తప్పనుంది.

ప్రైవేట్ పోటీని తట్టుకుకోవడంతోపాటు ప్రభుత్వ విద్యకు పట్టం కట్టేందుకు విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు అధికారులు. విద్యార్థులు లేక అల్లాడుతున్న సర్కారీ స్కూళ్లకు పునరుజ్జీవం పోసేందుకు నడుం బిగించారు. ఇందుకోసం సర్కారీ స్కూళ్లలో స్మార్ట్ చదువులను అమలు చేయనున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు టాబ్లెట్ పీసీల చదువులను అందించనున్నారు. సర్కారీ స్కూళ్లల్లో స్మార్ట్ లెస్సన్స్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ జిల్లా నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలోని రెండు పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

డిజిటల్ పాఠాలు..


సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. ఇప్పటి వరకు కార్పొరేట్ పాఠశాలలు వీటిని అందిపుచ్చుకున్నాయి. ఫలితంగా సర్కారీ పాఠశాలలు వెలవెలబోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు స్మార్ట్ స్కూళ్లను అస్త్రంగా విసురుతున్నారు. ఎంపిక చేసి రెండు స్కూళ్లలో డిజిటల్ పాఠాలు బోధించనున్నారు. పుస్తకాల అవసరం లేకుండా బోధన డిజిటల్‌లో సాగనుంది. ఇంత కాలం ఈ తరహా చదువులు కేవలం కార్పొరేట్ స్కూళ్లలోనే లభించాయి. దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ వైపే పిల్లలను పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్యులు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ చేపట్టిన ప్రయోగంతో ప్రభుత్వ స్కూళ్లకు పూర్వ వైభవం వస్తుందని అధికారులు ధీమావ్యక్తం చేస్తున్నారు. 

పుస్తకాల స్థానంలో టాబ్లెట్ పీసీలు..

 
స్మార్ట్ స్కూళ్లలోని విద్యార్థులకు పుస్తకాలకు బదులు టాబ్లెట్లు అందిస్తారు. స్మార్ట్ బోర్డుల ద్వారా తరగతులు బోధించడానికి స్కూళ్లలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ప్రతి తరగతి గదిని స్మార్ట్ గదిగా మలుస్తారు. స్మార్ట్ బోర్డుల ద్వారా డిజిటల్ పాఠాలు బోధించడానికి కావాల్సిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి.. వారికి శిక్షణ ఇస్తారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో రూపొందిన పాఠ్యాంశాలతో కూడిన సీడీలకు టాబ్లెట్లలో పొందుపరుస్తారు. వీటిని తయారు చేసేందుకు ఉపాధ్యాయ నిపుణులు ఇప్పటికే రంగంలోకి దిగారు. సీడీలను ఓపెన్ చేసుకుని బోధనకనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది వరకు పాఠశాలల్లో బోధనకు నల్లబల్లలను వినియోగించేవారు. తాజాగా స్మార్ట్ క్లాసెస్‌ల్లో తెల్ల బల్లలను ఏర్పాటు చేస్తారు. ఎల్‌సీడీ ప్రొజెక్టర్ సహాయంతో ఉపాధ్యాయులు బోధిస్తారు. 

గత అనుభవాలే పాఠంగా..


గతంలోనే స్మార్ట్ స్కూళ్లకు హైదరాబాద్‌లో ముందడుగు పడింది. సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో జిల్లాలో 12 పాఠశాలలను గతంలోనే స్మార్ట్ స్కూళ్లుగా ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి బోధన కొనసాగిస్తున్నారు. వీటిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎల్‌సీడీలను వినియోగించి బోధిస్తున్నారు. అయితే, అసంఘటితంగా బోధన కొనసాగుతుండడం.. ఉపాధ్యాయులు శిక్షణ పొందకుండానే బోధిస్తుండడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవడం.. స్మార్ట్ స్కూళ్లను ప్రోత్సహిస్తుండడంతో ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజా ప్రయోగం విజయవంతమైతే.. జిల్లాలోని 181 ఉన్నత పాఠశాలల్లోనూ స్మార్ట్ తరగతులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గతంలో ఎంపికైన పాఠశాలలివే..


1. మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(గన్‌ఫౌండ్రీ, నాంపల్లి)
2. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, రోడ్ నెం-7 బంజారాహిల్స్ (ఖైరతాబాద్)
3. ప్రభుత్వ ఉన్నత పాఠశాల దరిచే బవాహిర్(బహుద్దూర్‌పుర)
4. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హైదర్‌గూడ (హిమాయత్‌నగర్)
5. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హిల్‌స్ట్రీట్(సికింద్రాబాద్)
6. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల బొల్లారం (మారేడ్‌పల్లి)
7. ప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాల ఫలక్‌నుమా(బండ్లగూడ)
8. బాలికల ఉన్నత పాఠశాల చౌనినాదలీబేగ్ (చార్మినార్)
9. ప్రభుత్వ ఉన్నత పాఠశాల (అమీర్‌పేట) 
10. బాలుర ఉన్నత పాఠశాల కుల్సుంపుర (గోల్కొండ)
11. ఉన్నత పాఠశాల, సితాఫల్‌మండీ(ముషీరాబాద్)
12. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మలక్‌పేట (సైదాబాద్)

No comments:

Post a Comment