![]()
Medak చూడదగు స్థలములు |
ఆ హ్లాదాన్ని... ఆనందాన్ని... పంచే సుందర ప్రదేశాలు... జాలువారే జలపాతాలు... మరచిపోలేని మదురానుభూతులను పంచే ప్రకృతి అందాలు... సుందర ప్రదేశాలు... వన్యప్రాణులతో అలరారే అభయారణ్యాలు... గత చరిత్రను తెలియజెప్పే చారిత్రక కట్టడాలు... మెదక్ జిల్లాలో ఉన్నాయి. నేటి పోటీ ప్రపంచంలో యాంత్రిక జీవనం సాగిస్తూ విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తున్న వారికి మానసిక ప్రశాంతతను కలిగించేందుకు సహజ ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతున్నాయి.
సహజ ప్రకృతి అందాల సమహారం ఏడుపాయల
పుణ్యక్షేత్రంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది ఏడుపాయల. మెదక్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాపన్నపేట, కొల్చారం మండలాల సరిహద్దులో ఉన్న ఏడుపాయల ప్రాంతం సహజసిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారుతుంది.గలగల పారే మంజీరా నదిపాయలు, నిండుగా నీటితో కళకళలాడే ఘనపూర్ ఆనకట్ట, ఎతై్తన రాళ్లగుట్టలు, అబ్బుర పరిచే శిలాకృతులతో... చుట్టూరా కొండలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలం మినహా మిగతా సమయాల్లో పచ్చదనంతో కళకళలాడుతూ... నదీ పాయల పరవళ్లతో ఏడుపాయల సందర్శకులకు మరచిపోలేని మదురానుభూతులను మిగుల్చుతుంది.
కట్టిపడేసే చర్చి, గోల్‌బంగ్లా
మెదక్ పట్టణంలోని సుప్రసిద్ధ చర్చి అతిసుందరమైన కట్టడం. పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించదగ్గ ప్రదేశం. అత్యద్భుతమైన నిర్మాణ శైలి. ఆశ్చర్యం గొలిపే అద్దాల కిటికీలు. విఖ్యాత మెదక్ చర్చిని సందర్శిస్తే కనిపించే దృశ్యాలివి. ఆసియా ఖండంలో ఉన్నతమైనదిగా గుర్తింపుపొందిన ఈ కెథడ్రల్ చర్చి యూరఫ్ గోతిక్ శైలిలో నిర్మితమైంది. ఇటలీ దేశస్తులతో పాటు, భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ నిపుణులు, కళాకారులు చర్చి నిర్మాణం పనుల్లో పాలుపంచుకొన్నారు. 200 అడుగుల పొడవు... 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకొన్న ఈ మహాదేవాలయానికి 175 అడుగుల ఎత్తున్న శిఖరం (టవర్) ప్రత్యేక ఆకర్షణ. పూర్తిగా రాళ్లు, డంగుసున్నం వినియోగించి 10 సంవత్సరాలపాటు నిర్మించిన చర్చిలో అడుగడుగునా కళాత్మక నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్థులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, ఎతై్తన శిఖరాన్ని నిర్మించడం, ప్రార్థనా మందిరం పైకప్పును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఆనాటి నిర్మాణ నిపుణుల పనితనానికి నిదర్శనం. చర్చిలోపలి భాగంలో నేలపై ఇంగ్లాండు నుంచి తెప్పించిన రంగురంగుల టైల్స్‌లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శబ్దం ప్రతిధ్వనించకుండా నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. చర్చిలో రంగురంగుల స్టెయిన్ గ్లాసు ముక్కలతో రూపొందించిన కిటికీలు క్రీస్తు జన్మవృత్తాంతాన్ని కన్నులకు కడతాయి. ఇంగ్లాండ్ చిత్రకారుడు ఫ్రాంక్.ఓ.సాలిస్ బరి ఎంతో సృజనాత్మక నైపుణ్యంతో కళాత్మకంగా వీటిని రూపొందించారు. దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో రూపొందించిన బైబిల్ పఠన వేదిక, బాత్ స్టోన్‌తో తయారుచేసిన ప్రసంగ వేదిక, ఇటాలియన్ స్టోన్‌తో నిర్మించిన వేదిక ఫ్లోరింగ్, రంగూన్ టేకు కలపతో తయరుచేసిన ఫర్నీచర్, గులాబి కర్రతో రూపొందించిన కుర్చీలు, వెలుగులు విరఖ్ణ్మీ;మ్మే షాండ్లియర్‌లు ఇలా చర్చిలో ప్రతీదీ ప్రత్యేకమే. అన్నీ ఆకట్టుకొనేవే. చర్చి శిఖరం పైభాగాన వేలాడదీసిన శిలువ రాత్రివేళ లైట్ల కాంతితో ధగధగలాడుతుంది. ఐదు వేల మంది భక్తులు ఒకే సారి దైవారాధనకు కూర్చునే వసతి ఈ మందిరంలో ఉండటం విశేషం. మెదక్ చర్చి అందాలను చూసి తీరాల్సిందే. చర్చి సమీపంలోనే ప్యాలెస్‌ను తలపించే ‘గోల్‌బంగ్లా’ ఉంది. ఇంగ్లాండ్‌లోని ట్రినిటీ ప్యాలెస్ తరహాలో నిర్మితమైన ఈ బంగ్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకొంటుంది. ఈ బంగ్లాలో పలు సినిమా షూటింగ్‌లు జరిగాయి.* హైదరాబాద్ నుంచి మెదక్ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరం.
చరిత్రచెప్పే ‘ఖిల్లా’
మెదక్ పట్టణంలో పడమర దిక్కున సహజసిద్ధంగా ఏర్పడిన ఎతై్తన గుట్టపై ఉన్న పురాతన కోట (ఖిల్లా) దర్శనీయ స్థలం. కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. రాజ్యపాలనా వ్యవహారాల కోసం కాకుండా రక్షణ అవసరాల దృష్ట్యా ఈ కోటను నిర్మించి... దీనిని సైనిక దుర్గంగా వినియోగించినట్టు కోట నిర్మాణ తీరుతెన్నులను బట్టి తెలుస్తుంది. పూర్తిగా కోట పైభాగానికి చేరుకోవాలంటే మొత్తం ఏడు ద్వారాలు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కోట చివరన ఉన్న మజీదుపై కులీకుతుబ్‌షాహీలకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. సందర్శన కేంద్రంగా ఉన్న మెదక్ ఖిల్లాను వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.
వన్యప్రాణులకు ఆలవాలం... పోచారం
మెదక్ మండలంలో చివరన నిజామాబాద్ జిల్లా సరిహద్దులో పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఉంది. కృష్ణ జింకలు, నీల్‌గాయ్‌లు, సాంబార్‌లు, కొండగొర్రెలు. నెమళ్లు తదితర వన్యప్రాణులు అనేక రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి. ప్రతిఏటా వేసవి ముందర రాజస్థాన్ నుంచి రాజహంసలు (ఫ్లెమింగో)లు ఇక్కడికి వలస వస్తాయి. పోచారం అభయారణ్యంలో సందర్శకులు సేదతీరేందుకు ఆహ్లాదకరమైన పార్కు కూడా ఉంది. అభయారణ్యాన్ని ఆనుకొనే పోచారం ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఈ ప్రాంతం పిక్నిక్ స్పాట్‌గా మారింది. మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో అనేక మంది పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్ సందర్శనకు వస్తారు. అభయారణ్యం అందాలను, వన్యప్రాణులను తిలకించేందుకు వీలుగా వాచ్ టవర్‌లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్-మెదక్-బోధన్ మార్గంలో ఉన్న పోచారం అభయారణ్యానికి వెళ్లేందుకు హైదరాబాద్, మెదక్ నుంచి నేరుగా బస్సు సదుపాయం ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ వెళ్లే బస్సుల్లో ఎక్కి అభయారణ్యం వద్దే దిగొచ్చు. హైదరాబాద్ నుంచి 116 మెదక్ నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మంజీరా అభయారణ్యం... మొసళ్ల ప్రత్యేకం
సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజి వద్ద మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ మంచినీటి మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంది. వలస పక్షుల విడిది కేంద్రంగా ఈ అభయారణ్యం భాసిల్లుతోంది. రష్యా, నైజీరియా తదితర దేశాలకు చెందిన పలు రకాల పక్షులు ప్రత్యుత్పత్తి కోసం ఈ అభయారణ్యానికి ఏటా వలస వస్తాయి. మంజీరా నదిలోని ద్వీపాలలో ఉన్న చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకొని నెల్లాళ్లపాటు ఇక్కడే ఉండి మళ్లీ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తాయి.
పరవశింపజేసే ప్రాజెక్ట్ అందాలు
మెతుకు సీమ వరప్రదాయని అయిన మంజీరా నదిపై జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలో నిర్మితమైన సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా బ్యారేజ్‌లు సందర్శన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సింగూర్ ప్రాజెక్ట్ వద్ద విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సింగూర్ ప్రాజెక్ట్ 91 కిలో మీటర్ల దూరం.
కొండాపూర్ మ్యూజియం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 20 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రమైన కొండాపూర్‌లో పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరం. ఈ మ్యూజియంలో పురాతన కాలం నాటి మట్టి పాత్రలు, రకరకాల పరికరాలు, రాగి నాణాలు, మాతృదేవత ప్రతిమ, బౌద్ధస్థూపం ఉన్నాయి.
జడీమల్కాపూర్ జలపాతం
జహీరాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడీమల్కాపూర్ శివారులో ఉన్న జలపాతాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకొంటాయి. వంకలు తిరిగి ప్రవహించే వాగు... పలుచోట్ల పెద్దపెద్ద బండరాళ్ల పైనుంచి జాలువారుతూ జలపాతాన్ని తలపించే నీటి అందాలు కనువిందు చేస్తాయి.
పరవశింపజేసే గొట్టంగుట్ట అందాలు
జహీరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గొట్టంగుట్ట ప్రాంతం ఉంది. సువిశాలమైన అటవీప్రాంతం, చుట్టూరా ఎతై్తన కొండలు, దట్టమైన చెట్లు, కొండల మధ్యలో నుంచి వంకలు తిరుగుతూ ప్రవహించే పెద్ద వాగు, పురాతన దేవాలయం ఉండటంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకొనే వారికి ఎంతో అనువైనది. ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, కనుచూపు మేర వంకలు తిరుగుతూ వయ్యారంగా సాగిపోయే వాగు హోయలు పర్యాటకుల మదినిదోచుకొంటాయి. మనసుల్లో చెరగని ముద్రవేస్తాయి.
|
|
|
No comments:
Post a Comment