Saturday, September 19, 2015

గ్రూప్ 2,3 కి ఉపయోగపడే తెలంగాణ చరిత్ర..


తెలంగాణ చరిత్ర

(శాతవాహనుల నుంచి నిజాం పాలన అంతం వరకు)  
-శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండినులు, ముదిగొండ, వేములవాడ చాళుక్యుల గురించి చదవాలి. వీరికాలానికి చెందిన సామాజిక, సాంస్కృతిక, మత, పరిస్థితులు, భాషా సాహిత్యా లు, వాస్తుశిల్పకళలు మొదలైన అంశాల్ని అధ్యయనం చేయా లి. ఉదాహరణకు శాతవాహనుల చరిత్రకు ఆధారాలు, మ తం, సాహిత్యం, కళలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయాలి. నానాఘాట్, నాసిక్, కార్లే, చినగంజాం, అమరావతి, మ్యాకదోని, గిర్నార్, అల్లూరి, హాథిగుంఫా, గుంటుపల్లి మొదలైన శాసనాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి.
-సాహిత్యాంశాలకు సంబంధించిన ప్రముఖ గ్రంథాలు, వాటి రచయితలు మొదలైన అంశాల్ని చదవాలి.
-కామబంధన ప్రక్రియ ద్వారా తన భార్య మరణానికి కారకుడైన శాతవాహన రాజు ఎవరు? (దీనికి సంబంధించి ఆక్రామ. ప్రక్రియపేరు, రాజు, రాణిల పేర్లు తెలుసుకోవాలి) పౌరజన నిర్విశేష సమసుఖదుఃఖ అనే బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? మొదలైన అంశాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
కాతంత్ర వ్యాకరణం (సంస్కృతంలో) - శర్వవర్మ
బృహత్కథ (పైశాచీ ప్రాకృతంలో) - గుణాఢ్యుడు
గాథాసప్తశత్తి (గాథాసత్తపై - ప్రాకృతంలో) - హాలుడు
కామ సూత్రాలు - వాత్సాయనుడు
లీలావతి పరిణయం - కుతూహలుడు
ప్రజ్ఞాపారమిత శాస్త్రం - ఆచార్య నాగార్జునుడు
కువలయమాల - ఉద్యోతనుడు
-అదేవిధంగా బృహత్కథ ఆధారంగా వచ్చిన గ్రంథాలు రచయితలు (కథా సరిత్సాగరం- సోమదేవసూరి, బృహత్యధామంజరి- క్షేమేంద్రుడు, బృహత్‌కథా శ్లోకం - బుద్ధస్వామి) మొదలైనవాటిని గురించి అధ్యయనం చేయాలి. ఇండియన్ ఐన్‌స్టీన్, ఇండయిన్ మార్టిన్ లూథర్ అని పేరుగాంచిన ఆచార్య నాగార్జునుడు మూలమాధ్యమిక కరిక, రసమంజరి, రసరత్నాకరం, శూన్యసప్తశతి, సహ్రుల్లేఖ మొదలైనవి రచించాడు.
శాతవాహన రాజ్యానికి సంబంధించిన ముఖ్యాంశాలు
-స్థాపకుడు - శ్రీముఖుడు
-తొలి రాజుల్లో గొప్పవాడు - మొదటి శాతకర్ణి
-గొప్పరాజు - గౌతమీపుత్ర శాతకర్ణి
-చివరి రాజుల్లో గొప్పవాడు - యజ్ఞశ్రీ శాతకర్ణి
-చివరి రాజు - మూడో పులోమావి
-ఇక్షాకుల చరిత్ర ఆధారాలు, వాసిష్టిపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు, ఉపాసిక బోధిసిరి, వీరి మతం, సమా జం, వాస్తు శిల్పకళాసేవల్ని ఆకళింపు చేసుకోవాలి. విష్ణుకుండినుల శాసనాలు, మతం, సమాజం, కళలు మొదలైనవి చదవాలి.
-ఖమ్మంలోని ముదిగొండను రాజధానిగా చేసుకొని పాలించిన ముదిగొండ చాళుక్యులు, కరీంనగర్‌లోని వేములవాడ రాజధానిగా పరిపాలించిన వేములవాడ చాళుక్యుల గురించి అధ్యయనం చేయాలి. ఉదాహరణకు వేములవాడ చాళుక్యుల్లో గొప్పరాజెవరు? విక్రమార్జున విజయం రచించిందెవరు? సుబధామ జీనాలయం ఎక్కడు ఉంది? కవిజనాశ్రయం రచించిందెవరు? మొదలైన వాటిని చదవాలి.
కాకతీయులు


-కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి చాలా లోతుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొదట అనుమకొండను ఆ తర్వాత ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయులు చరిత్ర, సంస్కృతీ సాహిత్యం, మతం, వాస్తు కళా వైభవాలను క్షుణ్ణంగా అభ్యసించాలి. ఉదాహరణకు రెండో బేతరాజు, గణపతిదేవుడు, రుద్రమదేవి బిరుదులు, జైనం, శైవం, వైష్ణవ దేవాలయాలు మొదలైన వాటి గురించి చదవాలి.
-గోల్కొండను రాజధానిగా చేసుకొని పాలించిన కుతుబ్ షాహీలకు సంబంధించి, నాటి సాంఘిక, మత పరిస్థితులు, తెలు గు, ఉర్దూ, పర్షియన్ భాషల ప్రాధాన్యత, నాటి వాస్తు శిల్ప చిత్రకళా విశేషాలు మొదలైన వాటిని అధ్యయనం చేయాలి.
-కుతుబ్ షాహీల చరిత్రను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పురావస్తు ఆధారాలు, దేశీయ, విదేశీయ సాహిత్య ఆధారాలను గురించి క్షుణ్ణంగా చదవాలి.
ఉదా॥ ఖజయిన్-ఉల్-పుతు రాసిన అమీర్‌ఖుస్రూ క్రీ.శ. 14వ శతాబ్దంలో దక్కన్ పరిస్థితుల్ని వివరించాడు. తారీఖ్-ఇ-పెరిష్టాను మహమ్మద్ ఖాసీం పెరిష్టా రాశాడు. ఇది మధ్యయుగంలోని దక్కన్ చరిత్రను తెలుపుతుంది. జియా-ఉద్దీన్-బరౌనీ తన తారీఖ్-ఇ-ఫిరజ్‌సాహీలో దక్కన్ రాజ్యాల చరిత్రను రాశాడు. అదేవిధంగా ఈ కాలానికి చెందిన తెలుగు రచనలను చదవాలి.
-నాటి సమ్మిళిత సంస్కృతి, జాతరలు, పండుగలు, ఉర్సు, మొహర్రం మొదలైన వాటి గురించి చదవాలి.
-మీర్ ఖమరుద్దీన్ చిన్‌లిచ్‌ఖాన్ నిజాం-ఉల్-ముల్క్ స్థాపించిన అసఫ్‌జాహీ రాజ్యంలోని ముఖ్యాంశాలను చదవాలి. మొదటి నిజాం నుంచి చివరి (7వ నిజాం) నిజాం వరకు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. నిజాం-బ్రిటీష్ వారి సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.
-సాలార్‌జంగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక, రెవెన్యూ, పరిపాలన, న్యా య, విద్యా, రవాణా మొదలైన సంస్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టి చదవాలి. మహబూబ్ అలీ పాషా పరిపాలనా సంస్కరణలు, మీర ఉస్మాన్ అలీఖాన్ పాలనలోని ముఖ్యాంశాలు, సామాజిక పరిస్థితులు, నాటి జాగీర్దార్‌లు, దేశ్‌ముఖ్‌లు, జమీందారులు, దొరలు, వెట్టి, బగేలా విధానాలు మొదలైన విషయాలను అధ్యయనం చేయాలి.
-తెలంగాణలో సామాజిక-సంస్కృతిక చైతన్యం, ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, ఆంధ్రమహిళా సభ, నాటి హిం దూ, ముస్లిం సంస్థలు, ఉస్మానియాలో వందేమాతర ఉద్య మం, హైదరాబాద్ రాజ్యంలో జరిగిన ఆది హిందూ ఉద్యమంతోపాటు గ్రంథాలయోద్యమంలో కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెకంట రంగారావు మొదలైన వారు చేసిన కృషిని గురించి తెలుసుకోవాలి. ఆంధ్ర మహిళాసభలో ప్రధాన పాత్ర పోషించిన నడింపల్లి సుందరమ్మ, వరలక్ష్మీదేవి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంతలక్షీదేవి, ఆరుట్ల కమలాదేవి గురించి అవగాహన ఏర్పర్చుకోవాలి.
-నాటి గిరిజనులు, రైతుల తిరుగుబాట్లు, రాంజీగోండు, కొమురంభీం పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1948లో జరిగిన పోలీస్ చర్య పూర్వా పరాలు తత్ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం మొదలైన అంశాల్ని అభ్యర్థులు క్షుణ్ణంగా చదవాలి.
కాకతీయులు-ముఖ్యాంశాలు


-మూలపురుషుడు - కాకర్త్యగుండన
-రాజ్యస్థాపకుడు - బేతరాజు-I
-స్వతంత్ర రాజ్యస్థాపకుడు - రుద్రదేవుడు
-రాజధాని - హనుమకొండ, ఓరుగల్లు
-రాజభాష - సంస్కృతం
-మతం - జైనం, శైవం
-నగర నిర్మాతలు - అనుమకొండ (ప్రోల రాజు -II), ఓరుగల్లు (రుద్రుడు)
-నాట్యకత్తె - మాచల్‌దేవి
-ముఖ్య శిల్పకళలు - వేయిస్తంభాలగుడి (రుద్రదేవుడు), రామప్పగుడి (రేచర్లరుద్ర)
-ముఖ్య శాసనాలు - మాగల్లు శాసనం, బయ్యారం చెరువు శాసనం, వేయిస్తంభాలగుడి శాసనం, ఖాజీపేట శాసనం, పాలంపేట శాసనం, పల్లలమర్రి శాసనం, కరీంనగర్ రాగిపలక శాసనం, చందుపట్ల శాసనం
-గొప్పరాజు - గణపతిదేవుడు
-చివరి రాజు - రెండో ప్రతాపరుద్రుడు

గ్రూప్-2లో 4వ పేపర్.. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల కల, పోరాటం, ప్రజలు పడిన ఆరాటం, ఎన్నో ఉద్యమాలు, వెలకట్టలేని త్యాగాలు.. వీటన్నింటి ఫలితమే దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భావం. అంతకుముందు నిజాం వ్యతిరేకపోరాటాలు, ఖాసీంరజ్వీ అరాచకాలు, తెలంగాణ సాయుధ పోరాటం, పోలీస్‌చర్య, హైదరాబాద్ రాష్ర్టావతరణ. అటువైపు ఆంధ్రుల పోరాటం, రాష్ట్రం ఏర్పాటు.. అనంతరం విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రుల కుట్రల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. కొత్త రాష్ట్రంలో పెద్దమనుషుల ఒప్పందం, ఉల్లంఘనలు.. నీళ్లు, నిధుల దోపిడీలు.. 1969 తెలంగాణ ఉద్యమం, ముల్కీ నిబంధనలు-కోర్టు తీర్పులు, పర్యవసానాలు.. 1972 జై ఆంధ్ర ఉద్యమం, అష్ట సూత్రాలు, ఐదు సూత్రాలు, 610 జీఓ-ఉల్లంఘనలు, 371డీ ఆర్టికల్ రాష్ట్రపతి ఉత్తర్వులు, నక్సలైట్ ఉద్యమం, ప్రభావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం, 2004, 2009 సాధారణ ఎన్నికలు-పరిణామాలు, రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్/కేసీఆర్ పాత్ర, ఇతర పార్టీలు, సమాజంలో వివిధ సంఘాలు, వ్యక్తులు, వ్యవస్థల పాత్ర, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ ప్రక్రియ. స్థూలంగా గ్రూప్-2లో 4వ పేపర్ సంబంధించిన ఉద్యమ చరిత్ర.



గ్రూప్-2లోని 4వ పేపర్‌లో తెలంగాణ ఉద్యమం, రాష్ర్టావిర్భావం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉన్నాయి. అవి..
-1. తెలంగాణ భావన (క్రీ.శ. 1948-1970)
-2. సమీకరణ దశ (క్రీ.శ. 1971-1990)
-3. తెలంగాణ రాష్ర్టావిర్భావం దిశగా (క్రీ.శ. 1991-2014)
తెలంగాణ భావన


-హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ ప్రజలు, కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాలు, భాషలు, మాండలికాలు, జాతరలు, పండుగలు, తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య ప్రాంతాలు మొదలైన అంశాలను ఆకళింపు చేసుకోవాలి.
- హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, ముఖ్యంగా పరిపాలన, ఆర్థిక, రెవెన్యూ, కరెన్సీ, న్యాయ, విద్యారంగాల్లో సాలార్‌జంగ్ చేపట్టిన సంస్కరణలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు రెవెన్యూబోర్డు ఏర్పాటు, రెవెన్యూ మంత్రిత్వ శాఖ ఏర్పడిన సంవత్సరం? రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖ ఎప్పుడు వేరు చేయబడింది? న్యాయ స్థానాల పేర్లు, టంకశాల ఎప్పుడు ఏర్పాటైంది? స్థాపించిన పాఠశాలలు, కళాశాలలు, రైలు-రోడ్డు మార్గాల ప్రాధాన్యత, మొదలైన అంశాలపై దృష్టి సారించాలి.
-ముల్కీ-నాన్ ముల్కీ అంశాలను అధ్యయనం చేయాలి. 1919 నిజాం ఫర్మానా, నిర్వచనం, నిజాంలీగ్, అదేవిధంగా 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమవ్వడం, ఆ తర్వాత మిలటరీ పాలన, ముల్కీ నిబంధనల ఉల్లంఘన-అనంతర పర్యవసానాలను చదవాలి.
-స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం, బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం, 1952 ముల్కీ ఆందోళన, స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్, సిటీ కాలేజీలో జరిగిన సంఘటన, దాని ప్రాధాన్యత, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్డు, 1953లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం వచ్చిన డిమాండ్లు, రాష్ర్టాల పునర్‌వ్యస్థీకరణ కోసం ఫజల్ అలీ నేతృత్వంలో 1953లో కమిషన్ ఏర్పాటు, దాని ప్రధానాంశాలు, సిఫారసులు, చిన్న రాష్ర్టాల డిమాండ్‌పై డా.బీఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు మొదలైన అంశాలను చదవాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పు డు ఎన్ని జిల్లాలున్నాయి, తొలి ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్ ఎవరు అనే అంశాలతోపాటు ఆ తర్వాత ఏర్పడిన జిల్లాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.


1956-ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం



-పెద్ద మనుషుల ఒప్పందం-దాని ప్రధానాంశాలు, సిఫారసులు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు, విధులు, పనితీరు, తెలంగాణ రక్షణలు, ఉల్లంఘనలు, కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వలసలు, దాని పర్యవసానాలు, 1970 తర్వాత వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, విద్య, వైద్యం-ఆరోగ్యం, ఉద్యోగాలు మొదలైన రంగాల్లో తెలంగాణ అభివృద్ధి. ఉదాహరణకు పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ, ఆంధ్ర నాయకులు ఎవరు? ఒప్పందం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ప్రాంతీయ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? వలసలు, తెలంగాణలో వివిధ రంగాల్లో సంభవించిన పరిణామాలు మొదలైనవి చదవాలి.
-ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన: తెలంగాణ పోరాట మూలాలు, కొత్తగూడెం ఇతర ప్రాంతాల్లో నిరసనలు, 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర, మొదలైన అంశాలను చదవాలి. ఉదాహరణకు జై తెలంగాణ పోరాటం-కారణాలు, రూపాలు, నేపథ్యం, పర్యవసానాలు మొదలైనవి చదవాలి.
తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భావం


-ఉద్యమ విస్తరణలో మర్రి చెన్నారెడ్డి, మదన్‌మోహన్, అచ్యుతరెడ్డి, మల్లిఖార్జున్ మొదలైన వారి పాత్ర, 1971 ఎన్నికల్లో టీపీఎస్ గెలుపు, ఇందిరాగాంధీతో మర్రి చెన్నారెడ్డి లోపాయికారి ఒప్పందం, టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం, పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అవ్వడం (కోర్టు తీర్పువల్ల చెన్నారెడ్డి అనర్హతను ఎదుర్కోవడంతో పీవీ సీఎం అయ్యారు) మొదలైనవి చదవాలి. అఖిలపక్షం, జీఓ నెం. 36, తెలంగాణ ఉద్యమం అణచివేత-దాని పరిణామాలు, 8 సూత్రాలు, 5 సూత్రాల పథకాలు, వాటి ప్రభావం మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి. 
సమీకరణ దశ


-ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు, జై ఆంధ్ర ఉద్యమం-దాని పర్యవసానాలు, ఆరు సూత్రాల పథకం (1973)లోని అంశాలు, ఆర్టికల్ 371-డి, రాష్ట్రపతి ఉత్తర్వులు, జైభారత్ రెడ్డి కమిటీ (1975 ఆఫీసర్స్) నివేదిక, జీఓ 610- ఉల్లంఘనలు, తెలంగాణ ఉద్యోగుల ప్రతిస్పందన, వినతులు మొదలైన అంశాలు లోతుగా చదవాలి. ఉదా॥ ఆరుసూత్రాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యా యం, జోనల్ విధానం, జీఓ 610లను క్షుణ్ణంగా చదవాలి.
-నక్సలైట్ ఉద్యమం పుట్టుక, దాని పూర్వాపరాలు, ఎదుగుదల, కారణాలు-పర్యవసానాలు, జగిత్యాల, సిరిసిల్ల, ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, నాక్సలైట్ ముఖ్య నాయకులు మొదలైన అంశాలు, జల్-జంగల్-జమీన్ ప్రాధాన్యతను చదవాలి.
-ప్రాంతీయ పార్టీల పుట్టుక-ప్రభావం, తెలుగుజాతి భావన పేరు తో తెలంగాణ అస్థిత్వాన్ని అణచివేసే కుట్రలు, ఆధిపత్య సంస్కృతి, దాని ప్రభావాలు, కార్పొరేట్ విద్య మొదలైనవి చదవాలి.
-1990ల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలు, దాని ప్రభావాలు, అనేక రంగాల్లో ప్రాంతీయ అసమానతలు, హస్తకళల పతనం, తెలంగాణపై ప్రభావం, ప్రాంతీయ అసమానతలు, వివక్ష, తెలంగాణ వెనుకబాటుతనం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
తెలంగాణ రాష్ర్టావిర్భావం దిశగా...


తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం, మేధావుల స్పందనలు, పౌర సంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్-తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు భువనగిరి, వరంగల్ సభలు, ప్రకటనలు తీర్మానా లు (తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ), తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రయత్నాలు.
-2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, రాజకీయ పునరేకీకరణ, 2004 ఎన్నికల్లో పొత్తులు, యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రసమితి-గిర్‌గ్లాని కమిటీ-తెలంగాణ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎన్నికలు-పొత్తులు, ఎన్నికల మ్యానిఫెస్టోల్లో తెలంగాణ అంశం, హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా వచ్చిన పోరాటం, ప్రత్యేక రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహారదీక్ష, రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు మొదలైన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 
-రాజకీయ పార్టీల పాత్ర: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మొదలైనవాటితోపాటు దళిత-బహుజన సంఘాలు, ఇతర ఐక్య కార్యాచరణ కమిటీలు, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ సాధన సమితి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్, నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ నగార సమితి, తల్లి తెలంగాణ పార్టీ, ఉద్యమ సమయంలో వివిధ పార్టీల నాయకులు, ఆయా పార్టీలు అవలంభించిన విధానాలు, రాష్ట్రంకోసం జరిగిన ఆత్మహత్యలు-రాజకీయ పార్టీలపై వాటి ప్రభావం, మొదలైన అంశాలను చదవాలి. 
-తెలంగాణ ఉద్యమంలో వివిధ సాహిత్య కళారూపాలు, సాంస్కృతిక పునరుద్ధరణ, రచయితలు, గాయకులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు, వైద్యులు, మహిళలు, పౌరసంఘాలు, వివిధ కులాలు నిర్వహించిన పాత్ర, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణోద్యమం, మిలియన్ మార్చ్, మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి. 
పార్లమెంటరీ ప్రక్రియ


-తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వ విధానం, అఖిలపక్ష సమావేశం, ఆంటోనీ కమిటీ ఏర్పాటు, ఆ కమిటీ సభ్యులు, తెలంగాణ ఏర్పాటు అంశంపై కేంద్ర హోంమంత్రి ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు-దాని సిఫారసులు, తెలంగాణ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంటులో జరిగిన చర్చ, పరిణామాలు, రాష్ట్ర ప్రకటన, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు, 2014 ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రసమితి విజయం, ఎన్నికలకు సంబంధించిన ముఖ్యాంశాలు, రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు కావడం (2014, జూన్ 2) మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.

No comments:

Post a Comment