Monday, July 6, 2015

యాదాద్రి జిల్లా..? తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో కొత్తగా కొలువుదీరనున్న జిల్లాల జాబితాలో యాదాద్రి పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.




(భువనగిరి, నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర చిత్రపటంలో కొత్తగా కొలువుదీరనున్న జిల్లాల జాబితాలో యాదాద్రి పేరు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే లక్ష్మీనారసింహుడి క్షేత్రం యాదగిరిగుట్టను సైతం యాదాద్రిగా పిలుస్తున్న ప్రభుత్వం.. ఒక జిల్లాకు యాదాద్రి లేదా భువన యాదాద్రిగా నామకరణం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ యాదాద్రి పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతితో ప్రస్తావించినట్లు సమాచారం. భువనగిరి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న తూర్పు హైదరాబాద్ జిల్లాకు ఈ పేరు పెట్టే ఆలోచనలో సీఎం ఉన్నట్లు వినికిడి. 

యాదగిరిగుట్టకు సరికొత్త గుర్తింపు.. 
తెలంగాణ జిల్లాలను 24కు పెంచాలనే ఆలోచనను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ సమయంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల్లోనూ నూతన జిల్లాల ఏర్పాటును ప్రస్తావించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు సందర్భాల్లో చర్చించినట్లు సమాచారం. 

ఉద్యమ కాలం నుంచీ ఉన్న అంచనా ప్రకారం నల్లగొండ నుంచి సూర్యాపేట జిల్లా ఏర్పాటు కానుంది. గత ఆలోచనల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5నల్లగొండ జిల్లాలో.. మరో 5సూర్యాపేట జిల్లాలో కొనసాగుతాయి. కాగా.. ఆలేరు నియోజకవర్గం జనగాం జిల్లాలోకి.. భువనగిరి కేంద్రంగా హైదరాబాద్ ఈస్ట్ జిల్లాను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. భువనగిరి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నూతన జిల్లాకే యాదాద్రి లేదా భువన యాదాద్రి పేరు పెట్టే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సమాచారంతో.. ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న యాదగిరిగుట్టను సైతం యాదాద్రి జిల్లాలో కలుపుతారా? లేకుంటే ఆలేరులోనే కొనసాగిస్తూ.. జనగాం జిల్లాలో చేరుస్తారా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి.

No comments:

Post a Comment