యాదగిరి గుట్ట దేవస్థానం అభివృద్ది కోసం తయారు చేసిన ప్రణాళికలను త్వరితగతిన అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రధాన యాదాద్రీతో పాటు మొత్తం నవగిరులను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై ఇప్పటికే తయారైన ప్రతిపాదనలతో పాటు, కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపి బూర నర్సయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్సి నర్సింగ్‌రావు, దేవాదాయ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజి.గోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, నల్గొండ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్కిటెక్ట్స్ జగన్, ఆనంద్‌సాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి చుట్టూ ఇప్పటికే 943.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని మరో 100 ఎకరాలు సేకరిస్తామని, మొత్తం భూమిని ఆలయ అభివృద్దికే వినియోగిస్తామన్నారు. వరుసగా రెండు బడ్జెట్లలో కలిపి రూ. 200 కోట్లు కేటాయించామని, టాటా, అంబాని, జెన్కొ, భెల్ లాంటి సంస్థలు దాదాపు రూ. 500 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. కావల్సినంత భూమి, అవసరమయ్యే నిధులు సిద్దంగా ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. యాదాద్రి గుట్టపై 15 ఎకరాలు ఉన్నాయని, వీటిలో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తుందన్నారు. ఈ 5 ఎకరాల్లోనే ప్రాకారం, మాఢ వీధులు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతరాల ప్రతిమలు కూడా ఇందులోనే రావాలన్నారు. యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాల వరకు ఉంటుందని, దీన్ని సమర్దవంతంగా వినియోగించాలన్నారు. ఈ ప్రధాన గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్ కూడా నిర్మించాలని సిఎం చెప్పారు.
"యాదాద్రిపై పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకులకు నివాస గృహాలు, రథ మంటపం, క్యూ కాంప్లెక్స్, విఐపి గెస్ట్ హాజ్ నిర్మించాలి. దేవుడి ప్రసాదాలు తయారు చేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే రావాలి. యాదాద్రి కింద భాగంలో బస్టాండ్, కళ్యాణమంటపం, షాపింగ్ కాంప్లెక్స్, పూజకు వినియోగించే పూలచెట్లతో కూడిన స్వామి వారి ఉద్యాన వనం, మండల దీక్షలు తీసుకునే వారికోసం వసతి కేంద్రాలు నిర్మించాలి. యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యాన వనాలు, కాటేజీలు, గెస్ట్‌హౌజ్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, గోశాల, అన్నదానం కోసం భోజనశాల, పర్మినెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి''.
"యాదాద్రి సమీపంలోనే ఉన్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తాం. అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. కట్టను హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దాలి. యాదగిరి గుట్ట ప్రాంతమంతా నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటు చేయాలి. ప్రతీ రోడ్డుకు డివైడర్, పుట్‌పాత్ తప్పక ఉండాలి. మధ్యలో ఐ లాండ్స్ నిర్మించాలి. యాదగిరిగుట్ట ప్రాంతమంతా అందమైన చెట్లతో నిండాలి. భక్తి భావన పెంపొందే విధంగా ఈ ప్రాంతమంతా మారుమోగే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ఆధ్యాత్మికం, ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివెరిసే ప్రాంతంగా యాదగిరిగుట్ట మారాలి. వారం, పది రోజుల్లోనే పనులు ప్రారంభం కావాలి. 1000 ఎకరాల స్థలాన్ని జోనింగ్ చేసి, లే అవుట్ సిద్దం చేయాలి. ప్రస్తుతమున్న పున్నమి గేస్ట్ హౌజ్‌ను ఆధునీకరించాలి. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో 3 గెస్ట్‌హౌజ్‌లు నిర్మించాలి. ప్రస్తుతమున్న పుష్కరిణిని విస్తరించాలి. యాదగిరిగుట్ట ప్రాంతంలోని వివిధ దేవాలయాల ప్రాంతాలను అభివృద్ది చేయాలి. పాత యాదగిరిని కూడా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. గుట్ట కింద పెళ్లిళ్లు చేసుకునే విధంగా కళ్యాణమంటపాలు కట్టాలి. హైదరాబాద్‌కు సమీపంలోనే వున్న ఈ ప్రాంతాన్ని గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి''.


No comments:
Post a Comment